Saturday, September 21, 2013

నయాగరా

ట్రావెలాగ్ సీరీస్ లో నేను పరిచయం చేయాలనుకుంటున్న మరో ప్రదేశం 'నయాగరా'. నిజం చెప్పాలంటే ఆ ప్రదేశాన్ని పరిచయం చేయటం కంటే  అక్కడ ఉన్నపుడు నా అనుభవాన్ని గురించి చెప్తున్నాననటం బాగుంటుంది. 
నయాగరా
 నయాగరా వాటర్ ఫాల్స్ ని కెనడా వైపునుంచి, అమెరికా వైపు నుంచి కూడా చూడవచ్చు. రెండు దేశాలను కలుపుతూ ఓ బ్రిడ్జ్ ఈ వాటర్ ఫాల్స్ నుండి సాగే నది పై ఉంది. కానీ నయాగరా ని కెనడా వైపు నుండి చూడడమే బెస్ట్ వ్యూ అని చెప్పారు. ఈ ప్రదేశం చూడడం నాకో ఫాంటసీ అని చెప్పను కానీ చిన్నప్పటి నుంచి చదివిన, విన్న విషయాలు ఓ మూల ఎక్కడో నిక్షిప్తమై ఉండి, ఇలా చూసేఅవకాశం వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడా అని నన్ను విపరీతంగా కుతూహలపరచాయి. చూస్తూ ఉన్నపుడు, అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు, తిరిగి వచ్చాక కూడా ఓ కల లానే అనిపించింది. కానీ ఆ జలపాతం శబ్దం మాత్రం ఎప్పుడు గుర్తుకువచ్చినా ఆ రోజు, ఆ జ్ఞాపకాలు కల కాదు అని చెప్తూనే మనసుని మళ్లీ అక్కడకు తీసుకెళ్ళి అనుభవాన్ని మరోసారి తాజా చేస్తాయి.



నయాగరా సిటీ లోకి ప్రవేశించిన కొద్ది సమయానికే ఆ జలపాతం తనకంటూ ప్రత్యేకమైన ఉరిమే శబ్దం తో మనల్ని పలకరిస్తుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ తిరగండి గాక, మిమ్మల్ని నిలవనీయదు, తన వైపు లాక్కుంటున్న అనుభూతి కలిగిస్తుంది. గుర్రపు నాడా ఆకృతిలో కిలోమీటర్ల కొద్దీ  పరుచుకుని జారుతున్న కొన్ని వందల ధారలు చూపు మరల్చుకొనీయవు. నయాగరా ని ఒక్కో చోట నుండి, ఒక్కో టైమ్ లో చూడటం ఓ వైవిధ్యమైన అనుభవాన్ని అందిస్తాయి. రాత్రి పూట ఈ జలపాతం పై లేజర్ షో ఉంటుంది. పక్కనే ఉన్న రోడ్ మీద వెళ్తూ కూడా చూడవచ్చు, కానీ మరింత దగ్గరగా చూడటానికి ఓ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుచేసి, టికెట్ కొన్న వాళ్ళకు దగ్గరనుండి చూసే అవకాశం కల్పిస్తారు. ఎక్కడో దూరం నుండి ఫోకస్ చేసిన లేజర్ కిరణాలు ఈ నీటి ధారలను రంగులమయం చేసి, మనకూ జలపాతానికి మధ్య చీకటి అనేదే లేదన్న భావం కలుగ చేస్తాయి. 
   
'మైడ్ ఆఫ్ మిస్ట్' 
నయాగరా ని పగలు, అతి దగ్గరగా చూడటం మాత్రం సాటిలేని అనుభవం. 'మైడ్ ఆఫ్ మిస్ట్' అని లాంచీ లో జలపాతం దగ్గరగా చూపిస్తారు. 'మైడ్ ఆఫ్ మిస్ట్'  అని రాసి ఉన్న ఓ రైన్ కోట్, మరికొన్ని జాగ్రత్తలతో లాంచీ ఎక్కిస్తారు. అప్పటికే ఆ జలపాతం నీటిపై ఉన్నామన్న ఫీలింగ్, దగ్గరగా వెళ్తున్నామన్న ఆలోచన మనసుని ఉరకలు తీయిస్తాయి. దగ్గరగా వెళ్తున్న కొద్దీ కొన్ని వందల రెట్లుగా పెరుగుతున్న శబ్దం, ధాటిగా కొడుతున్న నీటి జల్లు మొదట భయం, తర్వాత అయోమయానికి గురిచేస్తాయి. అతి దగ్గరగా వెళ్ళాక అయితే, కొన్ని వేల ఉరుముల శబ్దం, భరించలేమేమొ అన్నంత వేగంగా జారుతున్న నీళ్ళు, ఇలాంటివి చాలా చూశాం లే అని నీటి ప్రవాహానికి, కాల గమనానికి నిలబడిన రాళ్లు, ఉన్న చోట నిలబడ నీయని జల్లు, ఇవన్నీ తట్టుకోలేని కొన్ని హృదయాలు పెట్టె గావుకేకలు, అన్నీ కలిసి మనసుకి ఓ వింత అయిన అనుభవాన్ని ఇస్తాయి. అలా చూసిన అనుభూతిని శాశ్వతం చేస్తాయి. కళ్ళు మూసుకుని అలా ఉంటే అనంత విశ్వం, పాతాళపు అంచులు గుర్తుకురావటం ఖాయం.  నాకైతే ఎప్పుడో చిన్నప్పుడు చదివిన 'గంగావతరణమ్', గుర్తుకొచ్చింది. లాంచీ దగ్గరగా తీసుకెళ్ళి అలా తిప్పి తీసుకుని వెళ్తారు. దూరమయ్యే కొద్దీ కొంచెం కొంచెం గా ప్రశాంతత ఆవరిస్తున్నట్లనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల వరకు ఆ శబ్దం, అనుభవం వెంటాడినట్లు అనిపిస్తాయి.

నయాగరా, మైడ్ ఆఫ్ మిస్ట్ నుండి దగ్గరగా...
నయాగరా లో మరో చూడవలసిన ప్రదేశం అక్కడి మ్యూజియం. చరిత్ర, నావికులు, సాహసగాధలు కలిపిన డాక్యుమెంటరీ చూపిస్తారు. అన్నిటికంటే ఒళ్ళు గగుర్పొడిచే విషయం ఏంటంటే, నయాగరా నుండి జారాలని కొందరు ప్రయత్నం చేశారని, వాళ్ళ ట్రయల్స్, ఆ ప్రయత్నం లో మరణించిన వాళ్ళు, విజయం సాధించిన వారు అన్నీ విషయాలు పొడిపొడిగా ఉన్న ఓ వీడియో చూపిస్తారు.వాళ్ళు వాడిన బాక్స్ ల నమూనాలు అక్కడున్న మ్యూజియం లో చూడవచ్చు. పదే పదే ప్రయత్నం చేసిన వాళ్ళ కథలు, జయాపజయాలు చూసినప్పుడు మాత్రం గొప్పగా అనిపించవచ్చు.

 ఓ సాహసగాధ
 ప్రస్తుతం నయాగరా నుండి జారటం నిషేధం. పది వేల డాలర్ల ఫైన్. కానీ 'చరిత్ర లోచేరటం ముందు ఇది చాలా చిన్న మొత్తం' అని ఓ పెద్దమనిషి రాశాడు అక్కడ. ఇవికాక కాసినోలు, గేమింగ్ జోన్లు చాలా ఉన్నాయక్కడ. ఎన్నున్నా ఆ హోరు, భయం, దృశ్యం కలిపి నయాగరా అందించే థ్రిల్ ముందు ఏదైనా దిగదుడుపే.



Friday, September 13, 2013

మున్నార్......

             ప్రతి  ప్రాంతానికి తనదైన చరిత్ర, మనుగడ, అందం, భాష, సంస్కృతి ఉంటాయి. కాకపోతే చూసేవారి ఓపిక, తీరికలను బట్టి ఆ ఉన్న కాలం వృధాగా అనిపించవచ్చు లేక ఓ అందమైన అనుభవంగానూ మిగలవచ్చు. నేను చూసిన, ఆస్వాదించిన కొన్ని ప్రదేశాలను నా కళ్ళతో చూపించే ప్రయత్నం చేస్తా. ముందుగా, చివరిగా చూసివచ్చిన "మున్నార్" ని పరిచయం చేయాలనుకుంటున్నాను.


 మున్నార్......
           మున్నార్......హిల్ స్టేషన్ లో మజా రుచి చూడాలంటే ఓ మంచి చలి కాలంలోనే వెళ్ళాలని నా ఫీలింగ్. ఏ సమ్మర్లో నైనా వెళితే ఏదో ఎండ బాధలు తప్పించుకోవటానికి వచ్చామనిపిస్తుంది తప్ప అక్కడకు మాత్రమే ప్రత్యేకమైన అందాలు చూడలేము. పైగా తిరిగొచ్చాక వాతావరణం మార్పులు, ఆ బాధలు బోనస్. హిల్ స్టేషన్ అంటేనే చలి, నిండా ఓ లాంగ్ కోట్ ఉండాలి, చలి దూరకుండా ఓ మంకీ కాప్ ఉండాలి, గాలి ఊదినప్పుడల్లా పొగలు రావాలి, ఇన్నిటిపైన ఓ మంట వేసుకోవడానికి సరిపడా 'అబ్బో' అనిపించే చలి, మంచు కావాలి, అప్పుడే అసలు మజా. మున్నార్ లో ఇవన్నీ ఫ్రీ... ఫ్రీ.....ఫ్రీ.....కావాల్సినంత,.....మీరనొచ్చు ఇవన్నీ ఏ చలి కాలంలో నైనా ఇక్కడ కూడా ఉంటాయి కదా అని, ఇంటి తిండి ఎంత బాగున్నా అప్పుడప్పుడు హోటల్ కి వెళ్తాంకదా మాస్టారూ, ఇదీ అంతే, ఎప్పుడూ మనం తినటం కాదండి, మనసు మూలల్లో దాక్కున్న సరదా మనిషికి కొత్తగా ఏమన్నా రుచి చూపించండి, మళ్లీ ఎప్పుడని అవురావురుమంటూ ఎలా ఎదురుచూస్తారో చూడండి.  
               మున్నార్ కేరళ లో, ఇడుక్కి జిల్లా లో ఉంది. ఇటు కొచ్చిన్ నుండి ఓ నాలుగు గంటలు, అదే మధురై నుండి అయితే అయిదు గంటల ప్రయాణం. మంచి  సరదాగా ఉండే ప్లేస్. ఏ టూరిజం సైట్ నో, ట్రావెల్ వాళ్ళనో పట్టుకుంటే బాబోయ్ ఇన్ని చూపిస్తారా అనే లా ఓ పెద్ద లిస్ట్ చెప్తారు. కానీ అసలు అందం ఆ తిరగటం లో లేదు, అంత పాపులర్ అయిన చోట కూడా, అక్కడ పరుచుకున్న టీ తోటలు, కొండలు, మేఘాలు, నీటికాలువలలా జనాలు కూడా నిశ్శబ్దం గుప్పిట్లో మెల్లగా సాగే పిల్ల గాలి లా సాగిపోతుంటారు చూడండీ, ఆది నచ్చింది నాకు, హారన్ కొట్టటం కంటే ఓ రెండు నిముషాలు ఆగుదామనే ఆలోచన,  ఏదో మొక్కుబడి గా కాకుండా మారుమూల దాగున్న పూల మొక్కల నించి, ఫుడ్ హ్యాబిట్స్ వరకు అన్నీ పరిచయం చేద్దామన్న తాపత్రయం, ఓ రెండు రోజులు ఉండిపోయే మనిషి కి తప్పనిసరిగా ఈయనవసరం లేని మర్యాద మున్నార్ ని మనసుకి దగ్గర చేస్తాయి.కనుచూపుమేర టీ తోటలు, ఓ మైలు నడిచి తలెత్తి చూసినా అలానే వాలుగా చూస్తూ, వయ్యారంగా పరుచుకొని ముసిముసిగ నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. మధ్యలో కొలతల ప్రకారం నాటిన సిల్వర్ ఓక్ చెట్లు కేవలం మేఘాలతో మాత్రమే కబుర్లు చెప్తుంటాయ్. కొత్తగా ఏముంది అనిపించదు, అలా చలితో మాట్లాడుకుంటూ నడిచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. 
          
టీ తోటలు...మధ్యలో సిల్వర్ ఓక్ చెట్లు
             ఈ చుట్టుపక్కన ఉన్న కొండలన్నింటిని 'కన్నన్-దేవన్ హిల్స్' అని పిలుస్తారు, మొట్టమొదట అక్కడికి వచ్చిన వారిద్దరి పేర్లు కలిసివచ్చేలా. ఈ ప్రదేశం ఎలా అభివృద్ది చెందిందో విపులంగా వివరిస్తూ అక్కడున్న 'కన్నన్-దేవన్' టీ మ్యూజియంలో ఓ చిన్న డాక్యుమెంటరీ కూడా చూపిస్తారు. మిగిలినవేమీ నాకు అంతగా అనిపించలేదు కానీ, ఈ టీ తోటల పై నడిచే ఫాక్టరీని బయట వాళ్ళకు ధారాదత్తం చేయబోతుంటే అక్కడ పని చేసేవారే వాటాలుగా కొనుక్కుని నడుపుతున్నారనే విషయం మాత్రం మహగొప్పగా అనిపించింది. టీ మ్యూజియంలో ఎలాంటి టీ ఆకులు పొడి చేయటానికి పనికొస్తాయో, ఎలా వేరు చేయాలో, మిగిలిన పద్దతి అంతా వాడే మిషన్ లతో సహా చూపిస్తారు. లేత, ముదురు ఆకులను ప్రాసెస్ చేశాక ఫైనల్ టీ పొడి ఎలా ఉంటుందో చూడవచ్చు.టీ తయారు చేసే కొత్తల్లో టీ ఫ్లాస్క్లు, ఫిల్టర్లు ఎలా ఉండేవో కొన్ని నమూనాలు ఉన్నాయక్కడ. చివరలో అక్కడే తయారు చేసిన టీ అని ఇచ్చారు కానీ, ఇవ్వకుండా ఉండుంటేనే అక్కడి షాప్ లో కొన్ని పాకెట్స్ కొని ఉండేవాళ్ళం. అంత 'మహాద్భుతమ్'గా ఉందా టీ.  

ఎకోపాయింట్
           మున్నార్ లో ఎకోపాయింట్ అని ఓ అందమైన ప్రదేశం ఉంది.  ఓ చిన్న పాయలా పారుతున్న నీరు, మెల్లగా సాగే అలలు, చుట్టూ ఆకుపచ్చటి పరదాకట్టినట్లు దట్టమైన సిల్వర్ ఓక్, పైన్ చెట్లు, ఆ వెనక  చిన్న కొండలు కలిపి మంచి వ్యూ పాయంట్. పెడల్ బోటింగ్ కూడా చేయవచ్చు. ముందు చెప్పినట్లు ఆ ప్రదేశమంతా మహా నిశ్శబ్దం గా ఉంటుంది పట్టపగలు కూడా, ఓ రాత్రి పొరపాటున అక్కడ ఉండవలసి వస్తే చుక్కలు మాట్లాడుకునే మాటలు కూడా వినబడతాయేమో.... అంత నిశ్శబ్దం. ఆ ప్రాంతం లో దొరికే కోక్ గింజలతో చాక్లెట్‌లు తయారు చేయటం అక్కడ వాళ్ళకు హాబీనో, కుటీరపరిశ్రమో తెలీదు కానీ, ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి. ఎకోపాయింట్ చుట్టుపక్కల అంతా అవే షాపులు.

'మెట్టుపట్టి' డామ్ నుండి వ్యూ
            మున్నార్ కి వెళ్లే ప్రతివారికి తప్పనిసరిగా చూపించబడే మరో ప్రదేశం 'మెట్టుపట్టి' డామ్. ఇలా ఎందుకంటున్నానంటే ఈ అందమైన చిన్న డామ్ పరిసరాలు సరైన ప్లానింగ్నో లేక సుపర్విజన్ లేకపోవటం వలన అనుకుంటా, ఎందుకో ఇఱుకుగా అనిపిస్తాయి. ఆ పై ఎక్కడ చూసినా చెత్త పోగుపడి ఉంటుంది. వీటన్నిటి మూలంగా పదే పదే వెళ్ళి చూడాలని అనిపించదు, తప్పనిసరైతే తప్ప. మున్నార్ లో ఓ అందమైన పూల తోట (ఫ్లవర్ గార్డెన్) కూడా ఉంది. ఓ చిన్న చోటులోనే విశాలంగా అనిపించేలా ముచ్చటగా అమర్చారు పూల మొక్కలని. అన్ని మొక్కల దగ్గర వాటి సైంటిఫిక్ పేర్లు, మరికొన్ని వివరాలతో సహా కనిపించేలా బోర్డులు, ఇంకొంచెం తెలుసుకోవాలనుకునే వారికోసం గైడ్ కూడా అందుబాటులో ఉంటారు. కొనాలనుకునే వారికోసం తేనె, చందనం బ్రాండ్ నేమ్ లతో అమ్ముతుంటారు.

మున్నార్ లో పూల తోట
       మున్నార్ లో నాకు అన్నిటి కంటే అందంగా అనిపించిన చోటు,అనైముడి పీక్. ఎంత వరకు నిజమో తెలియదు కానీ దక్షిణ భారతం లో ఉన్న పర్వత శ్రేణుల్లో ఇదే ఎత్తైన శిఖరం అని చెప్పారు, నాకైతే నమ్మబుద్ది కాలేదు.తీరా వచ్చాక గూగుల్ లో చెక్ చేస్తే నిజమే, ఇదే వెస్టర్న్ ఘాట్స్ లో ఎత్తైన శిఖరం. ఇవన్నీ కాదు కానీ మాస్టారూ, మున్నార్ అందమంతా ఒక ఎత్తు, ఈ ప్లేస్ నుంచి వ్యూ ఓ ఎత్తు. ఎంత చూసినా తనివితీరదు, అసలు వదిలి రాబుద్ది కాదు కూడా. ఈ ప్లేస్ ని 'ఏరావికులం నేషనల్ పార్క్' పేరుతో అభివృద్ది చేశారు.  'నీల్-థార్' అనే రేర్ బ్రీడ్ జింకలు అప్పుడప్పుడు కనబడతాయని చెప్పారు.  కొండపై ఓ లెవెల్ వరకే మన వెహికల్స్ రానిస్తారు, ఆ పై వాళ్ళ వెహికల్స్ లోనే పైకి తీసుకుని వెళ్తారు. ప్లాస్టిక్ అసలు తీసుకుపోనీరు. ఆ తర్వాత ఓ పాయింట్ నుండి, రెండు కిలోమీటర్లు నడిచే వెళ్ళాలి. పైన చెప్పిన దారంట పచ్చటి మలుపులు, మలుపు మలుపునా పలకరించే మేఘాలు, పిల్లలు అక్కడక్కడ కట్టి వదిలేసిన గజ్జనగూళ్ల పై దేవుడో తివాచీ పరచాడా అన్నట్లు ప్రతి చోటా చిన్న కొండలు,  వాటిపై ముచ్చటగా పెంచిన టీ తోటలు. నడుస్తుంటే కొన్ని మలుపుల్లో ఎక్కడినుంచో హఠాత్తుగా పిల్ల కాలువ పాయలు జిల్ అంటూ కాళ్ళు తడుపుతాయి. 'కాలం ఘనీభవించటం', 'నిశ్శబ్దం లో మమేకం కావటం' లాంటి కేవలం చదువుతుంటే తలకెక్కని చాలా పదాలు ముందు గుర్తుకొచ్చాయి, కొంచెం అర్థం అయినట్లు కూడా అనిపించాయి. ఇంకా ఎక్కువసేపు ఉంటే జ్ఞానొదయమ్ అయ్యేదేమో కానీ పార్క్ వాళ్ళు ఉండనివ్వలేదు, సాయంత్రం అయిదు గంటలకే తిరిగివెళ్లిపోవాలని చెప్పారు కనుక మాకు తప్ప లేదు, దిగి రావలసివచ్చింది. ఈ చోటు మాత్రం పదే పదే గుర్తొచ్చే, వదలి రాకూడదు అనిపించేలా ఉంటుంది, వదలివచ్చాక మనసు భారంగా కూడా ఉంటుంది. ఇవికాక కుండల డామ్ అని, రాజ-మలై ఫారెస్ట్ అని ఇంకా చాలా చెప్పారు కానీ, సరైన పెరుగన్నం తిన్నాక ఇంకేమీ వద్దనిపిస్తుంది కదా మాస్టారూ, అందుకే ఇంకెక్కడికి వెళ్ళబుద్ది కాలేదు. 

అనైముడి పీక్ నుండి వ్యూ
            ఫైనల్ గా.... ఒక్క మాట మాస్టారూ.... రోజుకో పేరు, ప్రాంతానికొక ప్రత్యేకత ఉండవచ్చు గాక, కానీ హేమంతఋతువుకు మాత్రమే చెల్లిన కొన్ని ఉషస్సులను,సాయంసంధ్యలను మున్నార్ మలుపుల్లో,మెరిసే మంచుబిందువుల సాక్షిగా ఆస్వాదించటం మాత్రం ఓ అందమైన అనుభవం.  

ఓ హేమంత ఉషః పరిమళం లో తడిసి ముద్దవుతున్న ........... మున్నార్ 


Thursday, February 21, 2008




జోధా అక్బర్




ఈ మధ్య చూసిన సున్నితమైన మరియు భావోద్వేగాలతో కూడిన చిత్రం. ఇది ఆ చిత్రానికి రివ్యూ కాదు. కేవలం నాకు నచ్చిన, నచ్చని సన్నివేశాలు పంచుకోవాలని మాత్రమే.

మామూలు సినిమా భాషలో చెప్పాలంటే తనదైన లోకంలో జీవించే ఓ రాజపుత్ర వనితగా, పరిస్థితులు అనుకూలించనప్పుడు కూడా తన ఆత్మ గౌరవం వీడని ఇల్లాలిగా, ఒక్కసారి ప్రేమ పెంచుకున్న తర్వాత అక్బర్ ప్రేమిక పాత్రలో ఎంతో అందంగా, సున్నితంగా ఎపుడూ చూడని ఐశ్వర్యను చూపించాడు దర్శకుడు. స్క్రిప్ట్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న పట్టు తర్వాత చూపించలేక పోవటంతో సినిమా చివరకి జోధ పాత్ర బేలగా మిగిలిపోతుంది.

ఉన్నట్లుండి జోధా తండ్రి ఇక ఏదారి లేనట్లుగా తన కూతురిని అక్బర్ కి ఇచ్చి చేయాలనుకోవటం నేనయితే జీర్ణించు కోలేకపోయాను. ఆ విషయంలో ఎంత మహారాజు అయిని కనీసం తన భార్యతో కూడా చర్చించినట్లు అనిపించదు . ఏం చేస్తాం ఆ కాలమే అంతేనేమో. ప్రజల కోసం తప్పదనుకుంటే సంధి చేసుకోవచ్చు, అక్బర్ అడిగింది కూడా అదే, లేదు తన కూతురిని కూడా అడగకుండా వెళ్లి మీకిచ్చిపెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పటం!! చరిత్ర కదా, జరిగి ఉండవచ్చు,మనం మార్చలేము కూడా, ఇది అల్లిన కారణం అయి ఉంటే మాత్రం బాడ్ ఐడియా. ఇదే స్టొరీని సోషల్ బాగ్రౌండ్ లో అయితే వందలసార్లు చూసిన ఫార్ములానే , ఇంత పెద్ద సెట్టింగులు అవసరం లేని స్టోరినే.

ఈ సినిమాలో అక్బర్ పాత్రకు ఉదారతను ఎక్కువగా ఆపాదించే దారిలో పాత్ర బలహీనమయింది, మొదట రాజపుత్రరాజుని చంపకుండా వదిలినప్పుడు హర్షించే ప్రేక్షకులు చివర తన సోదరి భర్త అన్న కారణం గా వదిలిపెడ్తున్నానని శరీఫుద్దిన్ తో అన్నపుడు అంగీకరించలేరు. కత్తి యుద్దాలు మాత్రం సినిమాకు ప్రాణం పోశాయనే చెప్పాలి. ఐశ్వర్య పాల్గొన్న ప్రతి యుద్దంలో స్తంభాలపై పడ్తున్న కత్తి దెబ్బలు నాకైతే ఇంత కసిగా చేస్తారా ఫ్రెండ్లీ యుద్దమైనా అన్పించింది.

అక్బర్ పాత్రకు హృతిక్ మాత్రమే సరిపోతాడా అన్నంతగా చేసాడా రోల్ ని. ఇంట్రడక్షన్ లో ఏనుగు తో ఫైట్ సినిమా కి ఎస్సెట్ .ఈ సినిమాలో అక్బర్, జోధా ల మధ్య లవ్ సీన్స్ కొత్త ఫీల్ ఇస్తాయి. జోధా మనసు గెల్చుకోవటానికి అక్బర్ చేసాడనిపించేలా మరి కొన్ని సీన్స్ చేసుంటే సినిమాకి ఊతమిచ్చేవి. ఆగ్రా రాను రాను అంటున్న ఐశ్వర్య సడెన్ గా ఎందుకు తిరిగి వచ్చిందో అర్థం కాలేదు. ఐతే తీర్థ యాత్ర పన్ను తీసేసాడు కాబట్టి హాపీగా ఫీల్ అయి వచ్చిందని సంతృప్తి పడ్డాను. అంతలోనే ఇంకో డౌట్ వచ్చింది, వదిలిపెట్టి వెళ్లి పోయాడని భయంతో రాలేదు కదా అని?? నాకైతే దర్శకుడు క్లైమాక్స్ ని బలంగా అల్లలేదని అన్పించింది. అక్బర్ లాంటి చక్రవర్తికి శత్రువులకు కొరవా? ఎన్నో పాత్రలు దొరుకుతాయి, గొడవ చేసే జనాలు ఎలాగు చేస్తారు, సినిమా మరింత హిట్ అయ్యేలా చరిత్ర వాడుకొని వుంటే బాగుండేది.

నేను చదివిన చరిత్రలో ఐతే రాజులకు , రాణులకు పెద్ద పెద్ద భవంతులు ఉండేవనీ, కోటలు చాల పెద్దవనీ చదివినట్లు  గుర్తు. ఈ సినిమా చూసాక అంతా ఒక ఇంట్లోనే ఉంటారని తెలిసింది, జోధ పాట పాడగానే దర్బార్ లో వున్నా రాజుగారు విని పరవశించేంతగా , రాణీగారు ఎవర్నో కలవటానికి వస్తే రాజుగారు గమనించగలరు కూడా, కోటలో చొరబడ్డ ఎవరైనా చాల వీజీగా గుర్రంఫై పారిపోవచ్చు, తిరిగి రావచ్చు .... సెట్టింగులు, డ్రెస్ డిజైన్ మాత్రం కళ్లు తిరిగేలా ఉన్నాయి, ఆ రేంజ్ లో హిందీ వాళ్లు మాత్రమే చేయగలరేమో. 

ఫస్ట్ హాఫ్ చూసి తిండి మానేసి సెకండ్ హాఫ్ చూద్దామనుకున్న నేను సినిమా పూర్తయేసరికి అరే! తినేసి చూసిన సరిపోయేదే అనుకున్నా !!

Friday, August 17, 2007

మన కైలాసగిరి సూసినావేటి...

మాస్టారూ, మా విశాఖ గురించి చెప్పాలంటే మాటలు వెతుక్కోనవసరం లేదండీ..., కదిలే కాళ్ళతో పాటూ నోరు కూడా మెదులుతూ ఉంటుంది...., నా తీయని జ్ఞాపకాల రొద మిమ్మల్ని వెంటాడుతుంది.......                                                                                       
ముందుగా మీరు ఎక్కడో దూరప్రాంతం నుండి వెళ్లారనుకుందాం, మీరు ట్రేన్ దిగగానే ఆది ఏ కాలం ఐనా కావచ్చుగాక, ఓ పిల్లగాలి అలా పలకరించి పోతుంది, ఆహా అనుకుంటూ అలా ఉండిపోకూడదూ......, అహా, ఓ రెండు అడుగులు అలా వేస్తారా, బాబూ ఆటో కావాలేటీ తమరికి......, అంటూ తమకు మాత్రమే సొంతమైన ఓ యాసలో పలకరింపు,  ఆశ్చర్యపోయేలోపు మరికొన్ని మర్యాదపూరిత వచనాలు.......                                        
మీరు కానీ పొద్దున్నే దిగితే నాదొక సలహా, తెల్లవారే వేళ ఖాళీగా ఉన్న రోడ్ల పై అలా నడుస్తూ పొండి, మస్తు ఎంజాయ్ చేస్తారు, నిజం నన్ను నమ్మండి, ఇంతకీ ఎక్కడకు వెళ్దామనుకుంటున్నారో తమరు, ఆది కానీ మధ్యాహ్నమైతే, నన్ను అడిగితే ఫ్రెష్ అయి అల్ కైలాసగిరి వెళ్ళమంటాను.                                                                        
అసలు ఆ కొండకు వెళ్లే దారే మంచి సరదాగా ఉంటుంది, ఓ వైపు కొండ , మరో వైపు ఎగిసిపడే అలలు, ఓపిక ఉంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళటమే ఉత్తమం, టాప్ చేరేలోపు కొన్ని కవితలే వస్తాయో, కథలే రాస్తారో, ఓ సంచి నిండా మధుర జ్ఞాపకాలే దాచుకుంటారో మీ ఇష్టం........, పైకి చేరాక ఏటన్నా వెళ్లండి పర్లేదు , సర్లే ముందుగా టైటానిక్ వ్యూ లో తోసుకుంటున్న జనాన్ని దాటుకుని మీరూ తొంగి చూడండి, ఇక ఈ భూమికి ఆ చివర సముద్రమే ఉందనిపించట్లేదూ, తల తిప్పి అన్ని వైపులా చూడండి మాస్టారూ , కొన్ని క్షణాలు ఈ జనాలు, జననాలు, మరణాలు అన్నీ మార్చిపోతారు, ఎప్పుడో ట్రేన్ దిగినప్పుడు పలకరించిన పిల్లగాలి ఇప్పుడు కుదురుగా కూర్చుని మీకు కహానీలు చెప్తుంది......., కదలండి మాస్టారూ ఇంకా చాలా ఉన్నాయ్, మీకోసం తివాచీలు అదే గడ్దివిలెండి పరిచి కైలాసగిరి ఆహ్వానిస్తుంది.                  

ఈ విశాఖ అందాలు చూసి ఎప్పుడో ఇక్కడికి తరలివచ్చిన ఆ ఆదిదంపతులను చూడండి, వాళ్ళు చెప్తారు ...ఈ సాయంత్రం, సముద్రం, ఈ జనసందోహం వాళ్లకెంత ఉల్లాసం కలిగిస్తున్నాయో, అందుకే చల్లని చూపుతో ఈ ప్రకృతిని పలకరిస్తున్నారు, పరవశింపచేస్తున్నారు, పరిరక్షిస్తున్నారు......, ఈ జనసముద్రం దాటుకుని వస్తానంటే మీకో ప్రశాంతమైన చోటు చూపిస్తా, అడుగో అక్కడ కనపడుతుందే, ఆ గ్లోబు వైపు కదలండి, దారిలో మీకో మందిరం కన్పిస్తుంది, లోనికి వెళ్ళి మీ ఐహిక బాధల ఆవలి గట్టును కొంచెం సేపు ధ్యానం లో చూసిరండి....,

ఈ కొండపైనుంచి తెన్నేటి పార్క్ ని చూడటం ఓ అందమైన అనుభూతి, ఎవరో తోటమాలి ఒక్కొక్క గడ్డి మొక్క ని అమర్చుకుంటూ పోతే , చిరు జల్లులు అప్పుడప్పుడు ఆ మొక్కలకు పచ్చ రంగులు చల్లుతూ ఉంటాయి, ఒకప్పుడు ఈ కైలాసగిరి , తెన్నేటి పార్క్ కలసి ఉండేవేమో, చూడటానికి రెండు కళ్ళు సరిపోనీ ఈ అందాన్ని చూడటానికి వస్తున్న కొన్ని వేల కళ్ళను చూసి ఓ మెలికల రహదారి తో వేరు చేశారు, పాపం కదూ, సరే కానీ , మీరు వెళ్ళి నప్పుడు వర్షాకాలం ఐతే శంఖు చక్ర నామాలున్న భవంతి ని ఎక్కి మెరిసే మెరుపులు చూడండి...., ఆ చాటున కైలాసగిరి ని తమ కాంతి లో చూసుకోవాలన్న వాటి ఆతృత ను చూడండి...., మీరు ఇప్పుడు చూస్తున్న కైలాసగిరి ని చూడాలని సంవత్సరాల తరబడి అలసిపోకుండా ఎగిసిపడుతున్న ఆ అలలను చూడండి....., నాలుగుదిక్కులను కలుపుతూ ఈ బిజీ లైఫ్ లో కూడా నెమ్మదిని చూపే విశాఖను చూడండి..... 

చీకటి పడిందని కంగారు పడాల్సిన పనిలేదు....... ఇక్కడి జనాల మంచితనం, ఆనందం ,ఈ ప్రశాంతత ఎప్పుడూ వెలుగులు చిమ్ముతూనే ఉంటాయ్ కానీ చిన్నగా రండి మాస్టారూ, రేపు ఇంకో చోటికి వెళ్దాం.

Tuesday, August 14, 2007

నా విశాఖ....

మాస్టారూ, మీరు ఉన్న ఊరు అందంగా ఉండుంటే , ఆహ్లాదం అందిస్తే, ఆనందం దోశిళ్లతో పంచుతుంటే... మీరున్నది విశాఖపట్నం లోనే కదా.. కాకపోతే నామాట విని ఒక్కసారి చూసిరండి మూడేళ్లు ....... చాలా బిరుదులివ్వాలని ఉంది, ఓ సుందర నగరమని ,ప్రకృతి అందాల కలబోతని, ...అలా అలా, విశాఖ, పేరు వింటేనే ఏదో తెలియని ఆనందం, ఎన్నో తీపి గురుతులు, విశాఖ లో ఉండికూడా ఎవరైన బోర్ గా ఉందన్నాడు అంటే మనసు లేని మనిషి అనాలేమో, అలా బీచ్ రోడ్ లో నడుస్తూ యుగాలు గడపాలనుంటుంది, కైలాసగిరి టైటానిక్ వ్యూ నుంచి తెన్నేటి పార్క్ ని చూడాలని, కైలాసగిరి మెట్లపైనుంచి చూస్తే, చీకటి పడే వేళ, ఎగిసిపడుతున్న అలలతొ కబుర్లు చెప్తున్న కొన్ని వందల నియన్ ల్యాంప్ లను పలకరించాలని ..... ఋషికోండ, యారాడ... ఇన్ని విశేషాలు ఒకేచోటా.. కొత్త వాళ్ళను స్వాగతిస్తూ, పాత వాళ్ళను పలకరిస్తూ... ఈవెంట్ ప్రొగ్రామ్స్, మస్తీ, ..పేరు ఏమైతేనేం సాయంత్రం కాగానే సరదా పరదాలు చుట్టూ కమ్మేసి .... ఏ మలిఝాముకో మేలుకువస్తుంది కళభారతి , కళాక్షేత్రం ...కళ తెలియనివాడికి అన్నప్రాసన, తెలిసిన వాడికి మస్తు భోజనం... ఐనా ఎంత చదివినా రాసినా ఆ ఆనందం రాదు, రాబోదూ... నా మాట విని ఒక్కసారి వెళ్లిరండి మాస్టారూ..