ప్రతి ప్రాంతానికి తనదైన చరిత్ర, మనుగడ, అందం, భాష, సంస్కృతి ఉంటాయి. కాకపోతే చూసేవారి ఓపిక, తీరికలను బట్టి ఆ ఉన్న కాలం వృధాగా అనిపించవచ్చు లేక ఓ అందమైన అనుభవంగానూ మిగలవచ్చు. నేను చూసిన, ఆస్వాదించిన కొన్ని ప్రదేశాలను నా కళ్ళతో చూపించే ప్రయత్నం చేస్తా. ముందుగా, చివరిగా చూసివచ్చిన "మున్నార్" ని పరిచయం చేయాలనుకుంటున్నాను.
![]() |
| మున్నార్...... |
మున్నార్......హిల్ స్టేషన్ లో మజా రుచి చూడాలంటే ఓ మంచి చలి కాలంలోనే వెళ్ళాలని నా ఫీలింగ్. ఏ సమ్మర్లో నైనా వెళితే ఏదో ఎండ బాధలు తప్పించుకోవటానికి వచ్చామనిపిస్తుంది తప్ప అక్కడకు మాత్రమే ప్రత్యేకమైన అందాలు చూడలేము. పైగా తిరిగొచ్చాక వాతావరణం మార్పులు, ఆ బాధలు బోనస్. హిల్ స్టేషన్ అంటేనే చలి, నిండా ఓ లాంగ్ కోట్ ఉండాలి, చలి దూరకుండా ఓ మంకీ కాప్ ఉండాలి, గాలి ఊదినప్పుడల్లా పొగలు రావాలి, ఇన్నిటిపైన ఓ మంట వేసుకోవడానికి సరిపడా 'అబ్బో' అనిపించే చలి, మంచు కావాలి, అప్పుడే అసలు మజా. మున్నార్ లో ఇవన్నీ ఫ్రీ... ఫ్రీ.....ఫ్రీ.....కావాల్సినంత,.....మీరనొచ్చు ఇవన్నీ ఏ చలి కాలంలో నైనా ఇక్కడ కూడా ఉంటాయి కదా అని, ఇంటి తిండి ఎంత బాగున్నా అప్పుడప్పుడు హోటల్ కి వెళ్తాంకదా మాస్టారూ, ఇదీ అంతే, ఎప్పుడూ మనం తినటం కాదండి, మనసు మూలల్లో దాక్కున్న సరదా మనిషికి కొత్తగా ఏమన్నా రుచి చూపించండి, మళ్లీ ఎప్పుడని అవురావురుమంటూ ఎలా ఎదురుచూస్తారో చూడండి.
మున్నార్ కేరళ లో, ఇడుక్కి జిల్లా లో ఉంది. ఇటు కొచ్చిన్ నుండి ఓ నాలుగు గంటలు, అదే మధురై నుండి అయితే అయిదు గంటల ప్రయాణం. మంచి సరదాగా ఉండే ప్లేస్. ఏ టూరిజం సైట్ నో, ట్రావెల్ వాళ్ళనో పట్టుకుంటే బాబోయ్ ఇన్ని చూపిస్తారా అనే లా ఓ పెద్ద లిస్ట్ చెప్తారు. కానీ అసలు అందం ఆ తిరగటం లో లేదు, అంత పాపులర్ అయిన చోట కూడా, అక్కడ పరుచుకున్న టీ తోటలు, కొండలు, మేఘాలు, నీటికాలువలలా జనాలు కూడా నిశ్శబ్దం గుప్పిట్లో మెల్లగా సాగే పిల్ల గాలి లా సాగిపోతుంటారు చూడండీ, ఆది నచ్చింది నాకు, హారన్ కొట్టటం కంటే ఓ రెండు నిముషాలు ఆగుదామనే ఆలోచన, ఏదో మొక్కుబడి గా కాకుండా మారుమూల దాగున్న పూల మొక్కల నించి, ఫుడ్ హ్యాబిట్స్ వరకు అన్నీ పరిచయం చేద్దామన్న తాపత్రయం, ఓ రెండు రోజులు ఉండిపోయే మనిషి కి తప్పనిసరిగా ఈయనవసరం లేని మర్యాద మున్నార్ ని మనసుకి దగ్గర చేస్తాయి.కనుచూపుమేర టీ తోటలు, ఓ మైలు నడిచి తలెత్తి చూసినా అలానే వాలుగా చూస్తూ, వయ్యారంగా పరుచుకొని ముసిముసిగ నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. మధ్యలో కొలతల ప్రకారం నాటిన సిల్వర్ ఓక్ చెట్లు కేవలం మేఘాలతో మాత్రమే కబుర్లు చెప్తుంటాయ్. కొత్తగా ఏముంది అనిపించదు, అలా చలితో మాట్లాడుకుంటూ నడిచి వెళ్ళిపోవాలనిపిస్తుంది.
ఈ చుట్టుపక్కన ఉన్న కొండలన్నింటిని 'కన్నన్-దేవన్ హిల్స్' అని పిలుస్తారు, మొట్టమొదట అక్కడికి వచ్చిన వారిద్దరి పేర్లు కలిసివచ్చేలా. ఈ ప్రదేశం ఎలా అభివృద్ది చెందిందో విపులంగా వివరిస్తూ అక్కడున్న 'కన్నన్-దేవన్' టీ మ్యూజియంలో ఓ చిన్న డాక్యుమెంటరీ కూడా చూపిస్తారు. మిగిలినవేమీ నాకు అంతగా అనిపించలేదు కానీ, ఈ టీ తోటల పై నడిచే ఫాక్టరీని బయట వాళ్ళకు ధారాదత్తం చేయబోతుంటే అక్కడ పని చేసేవారే వాటాలుగా కొనుక్కుని నడుపుతున్నారనే విషయం మాత్రం మహగొప్పగా అనిపించింది. టీ మ్యూజియంలో ఎలాంటి టీ ఆకులు పొడి చేయటానికి పనికొస్తాయో, ఎలా వేరు చేయాలో, మిగిలిన పద్దతి అంతా వాడే మిషన్ లతో సహా చూపిస్తారు. లేత, ముదురు ఆకులను ప్రాసెస్ చేశాక ఫైనల్ టీ పొడి ఎలా ఉంటుందో చూడవచ్చు.టీ తయారు చేసే కొత్తల్లో టీ ఫ్లాస్క్లు, ఫిల్టర్లు ఎలా ఉండేవో కొన్ని నమూనాలు ఉన్నాయక్కడ. చివరలో అక్కడే తయారు చేసిన టీ అని ఇచ్చారు కానీ, ఇవ్వకుండా ఉండుంటేనే అక్కడి షాప్ లో కొన్ని పాకెట్స్ కొని ఉండేవాళ్ళం. అంత 'మహాద్భుతమ్'గా ఉందా టీ.
| ఎకోపాయింట్ |
మున్నార్ లో ఎకోపాయింట్ అని ఓ అందమైన ప్రదేశం ఉంది. ఓ చిన్న పాయలా పారుతున్న నీరు, మెల్లగా సాగే అలలు, చుట్టూ ఆకుపచ్చటి పరదాకట్టినట్లు దట్టమైన సిల్వర్ ఓక్, పైన్ చెట్లు, ఆ వెనక చిన్న కొండలు కలిపి మంచి వ్యూ పాయంట్. పెడల్ బోటింగ్ కూడా చేయవచ్చు. ముందు చెప్పినట్లు ఆ ప్రదేశమంతా మహా నిశ్శబ్దం గా ఉంటుంది పట్టపగలు కూడా, ఓ రాత్రి పొరపాటున అక్కడ ఉండవలసి వస్తే చుక్కలు మాట్లాడుకునే మాటలు కూడా వినబడతాయేమో.... అంత నిశ్శబ్దం. ఆ ప్రాంతం లో దొరికే కోక్ గింజలతో చాక్లెట్‌లు తయారు చేయటం అక్కడ వాళ్ళకు హాబీనో, కుటీరపరిశ్రమో తెలీదు కానీ, ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి. ఎకోపాయింట్ చుట్టుపక్కల అంతా అవే షాపులు.
| 'మెట్టుపట్టి' డామ్ నుండి వ్యూ |
మున్నార్ కి వెళ్లే ప్రతివారికి తప్పనిసరిగా చూపించబడే మరో ప్రదేశం 'మెట్టుపట్టి' డామ్. ఇలా ఎందుకంటున్నానంటే ఈ అందమైన చిన్న డామ్ పరిసరాలు సరైన ప్లానింగ్నో లేక సుపర్విజన్ లేకపోవటం వలన అనుకుంటా, ఎందుకో ఇఱుకుగా అనిపిస్తాయి. ఆ పై ఎక్కడ చూసినా చెత్త పోగుపడి ఉంటుంది. వీటన్నిటి మూలంగా పదే పదే వెళ్ళి చూడాలని అనిపించదు, తప్పనిసరైతే తప్ప. మున్నార్ లో ఓ అందమైన పూల తోట (ఫ్లవర్ గార్డెన్) కూడా ఉంది. ఓ చిన్న చోటులోనే విశాలంగా అనిపించేలా ముచ్చటగా అమర్చారు పూల మొక్కలని. అన్ని మొక్కల దగ్గర వాటి సైంటిఫిక్ పేర్లు, మరికొన్ని వివరాలతో సహా కనిపించేలా బోర్డులు, ఇంకొంచెం తెలుసుకోవాలనుకునే వారికోసం గైడ్ కూడా అందుబాటులో ఉంటారు. కొనాలనుకునే వారికోసం తేనె, చందనం బ్రాండ్ నేమ్ లతో అమ్ముతుంటారు.
| మున్నార్ లో పూల తోట |
మున్నార్ లో నాకు అన్నిటి కంటే అందంగా అనిపించిన చోటు,అనైముడి పీక్. ఎంత వరకు నిజమో తెలియదు కానీ దక్షిణ భారతం లో ఉన్న పర్వత శ్రేణుల్లో ఇదే ఎత్తైన శిఖరం అని చెప్పారు, నాకైతే నమ్మబుద్ది కాలేదు.తీరా వచ్చాక గూగుల్ లో చెక్ చేస్తే నిజమే, ఇదే వెస్టర్న్ ఘాట్స్ లో ఎత్తైన శిఖరం. ఇవన్నీ కాదు కానీ మాస్టారూ, మున్నార్ అందమంతా ఒక ఎత్తు, ఈ ప్లేస్ నుంచి వ్యూ ఓ ఎత్తు. ఎంత చూసినా తనివితీరదు, అసలు వదిలి రాబుద్ది కాదు కూడా. ఈ ప్లేస్ ని 'ఏరావికులం నేషనల్ పార్క్' పేరుతో అభివృద్ది చేశారు. 'నీల్-థార్' అనే రేర్ బ్రీడ్ జింకలు అప్పుడప్పుడు కనబడతాయని చెప్పారు. కొండపై ఓ లెవెల్ వరకే మన వెహికల్స్ రానిస్తారు, ఆ పై వాళ్ళ వెహికల్స్ లోనే పైకి తీసుకుని వెళ్తారు. ప్లాస్టిక్ అసలు తీసుకుపోనీరు. ఆ తర్వాత ఓ పాయింట్ నుండి, రెండు కిలోమీటర్లు నడిచే వెళ్ళాలి. పైన చెప్పిన దారంట పచ్చటి మలుపులు, మలుపు మలుపునా పలకరించే మేఘాలు, పిల్లలు అక్కడక్కడ కట్టి వదిలేసిన గజ్జనగూళ్ల పై దేవుడో తివాచీ పరచాడా అన్నట్లు ప్రతి చోటా చిన్న కొండలు, వాటిపై ముచ్చటగా పెంచిన టీ తోటలు. నడుస్తుంటే కొన్ని మలుపుల్లో ఎక్కడినుంచో హఠాత్తుగా పిల్ల కాలువ పాయలు జిల్ అంటూ కాళ్ళు తడుపుతాయి. 'కాలం ఘనీభవించటం', 'నిశ్శబ్దం లో మమేకం కావటం' లాంటి కేవలం చదువుతుంటే తలకెక్కని చాలా పదాలు ముందు గుర్తుకొచ్చాయి, కొంచెం అర్థం అయినట్లు కూడా అనిపించాయి. ఇంకా ఎక్కువసేపు ఉంటే జ్ఞానొదయమ్ అయ్యేదేమో కానీ పార్క్ వాళ్ళు ఉండనివ్వలేదు, సాయంత్రం అయిదు గంటలకే తిరిగివెళ్లిపోవాలని చెప్పారు కనుక మాకు తప్ప లేదు, దిగి రావలసివచ్చింది. ఈ చోటు మాత్రం పదే పదే గుర్తొచ్చే, వదలి రాకూడదు అనిపించేలా ఉంటుంది, వదలివచ్చాక మనసు భారంగా కూడా ఉంటుంది. ఇవికాక కుండల డామ్ అని, రాజ-మలై ఫారెస్ట్ అని ఇంకా చాలా చెప్పారు కానీ, సరైన పెరుగన్నం తిన్నాక ఇంకేమీ వద్దనిపిస్తుంది కదా మాస్టారూ, అందుకే ఇంకెక్కడికి వెళ్ళబుద్ది కాలేదు.
| అనైముడి పీక్ నుండి వ్యూ |
ఫైనల్ గా.... ఒక్క మాట మాస్టారూ.... రోజుకో పేరు, ప్రాంతానికొక ప్రత్యేకత ఉండవచ్చు గాక, కానీ హేమంతఋతువుకు మాత్రమే చెల్లిన కొన్ని ఉషస్సులను,సాయంసంధ్యలను మున్నార్ మలుపుల్లో,మెరిసే మంచుబిందువుల సాక్షిగా ఆస్వాదించటం మాత్రం ఓ అందమైన అనుభవం.


2 comments:
నమస్కారమండి. మున్నర్ గురించి కేరళా friends ద్వారా చాలాసార్లు విన్నాను కాని మున్నర్ గురించి మీరు పరిచయం చేసింది చూసాక చాలా మిస్స్ అయ్యామని అనిపిస్తోంది.. మేము 15th Sep'13 మధురై వెళుతున్నాము. ఈ టపా ఒక్కవారం రోజులముందు వచ్చివుంటే ఖచ్చితంగా వెళ్ళేవారము.
మీpost చాలా బాగుంది..
మున్నార్ గురించి చాలా బాగా రాసారు .
Post a Comment